మూవీడెస్క్: జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర : పార్ట్ 1 సినిమాను గ్రాండ్ గా విడుదల చేసిన సందర్బంగా, తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు భారీ సంబరాలు జరుపుకుంటున్నారు.
ప్రత్యేకంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సుదర్శన్ థియేటర్ వద్ద ఎన్టీఆర్ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు.
అయితే, ఈ ఉత్సాహం మధ్యలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. అభిమానుల ఆనందాన్ని పంచే కటౌట్ అగ్ని ప్రమాదానికి గురవడంతో దగ్ధమైంది.
అయితే అక్కడ ఉన్న వారు ఫ్యాన్స్ టపాసులు కాల్చడమే ఈ ఘటనకు కారణమని చెబుతున్నారు.
టపాసుల నుంచి వచ్చిన నిప్పురవ్వలు కటౌట్ మీద పడటంతో భారీ కటౌట్ ఒక్కసారిగా మంటలు అంటుకుని కాలిపోయినట్లు తెలుస్తోంది.
అయితే, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే నిప్పు పెట్టారని ఆరోపణలు చేస్తున్నారు.
ఈ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఫైర్ సిబ్బంది వెంటనే వచ్చి మంటలను ఆర్పడంతో ఎవరూ గాయపడలేదు.
ఇక దేవర సినిమా అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం, యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు పెద్ద ట్రీట్ గా మారాయి.