తాడేపల్లి: తమిళనాడు సీఎం స్టాలిన్ ఆహ్వానం మేరకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను డీఎంకే నేతలు బుధవారం కలిశారు. తమిళనాడు మంత్రి ఈవీ వేలు, రాజ్యసభ సభ్యుడు విల్సన్ తాడేపల్లిలో జగన్‌ను కలిసి, మార్చి 22న చెన్నైలో జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలని ఆహ్వానించారు.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించేందుకు స్టాలిన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు, ప్రతిపక్ష నేతలను ఆహ్వానించిన ఆయన, జగన్‌ను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. స్టాలిన్ రాసిన లేఖను డీఎంకే నేతలు జగన్‌కు అందజేశారు.
జగన్ ఈ సమావేశానికి హాజరవుతారా లేదా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే, వైసీపీ ఇప్పటివరకు ఎన్డీఏ, ఇండియా కూటములతో దూరం పాటిస్తోంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్, కేంద్ర బీజేపీ నేతలతో సాన్నిహిత్యంగా ఉన్నా, అధికార, విపక్ష కూటములలో చేరలేదు.
ఇక స్టాలిన్ ఇండియా కూటమిలో ఉండటం విశేషం. అయితే, 2019లో జగన్ ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ హాజరయ్యారు. వారి మధ్య వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, రాజకీయంగా జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.
వైసీపీ, డీఎంకే రాజకీయ వైఖరి భిన్నమైనా, లోక్‌సభ పునర్విభజన వంటి కీలక అంశంపై జగన్ స్టాలిన్‌కు మద్దతు ఇస్తారా? సమావేశానికి హాజరవుతారా? అనే అంశంపై త్వరలో స్పష్టత రానుంది.