పులివెందుల: వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత మరోసారి రంగంలోకి దిగారు. తండ్రి హత్యకు సంబంధించి న్యాయం కోసం ఆమె గతంలో వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు సునీత వైసీపీ సానుభూతిపరులపై పోలీసు ఫిర్యాదు చేయడం పులివెందులలో సంచలనంగా మారింది. తాజాగా సునీత, వైఎస్ భారతి పీఏ వర్రా రవీంద్రారెడ్డిపై ఫిర్యాదు చేయడానికి పులివెందుల పోలీసు స్టేషన్కు వెళ్లారు.
ఫిర్యాదులో వర్రా తనపై దుర్భాషలతో దూషించినట్లు ఆరోపించారు. వర్రా తో పాటు పులివెందులకు చెందిన వైసీపీ సానుభూతిపరుడు ఉదయ్పైనా ఆమె ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలపై పోలీసులు కఠినంగా స్పందించాలని, తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు.
ఏపీ పోలీసుల ప్రకారం, వర్రా రవీంద్రారెడ్డిపై ఇప్పటివరకు 34 కేసులు నమోదయ్యాయి. ఆయనకు వైసీపీ కీలక నేతల అండతోనే ఇలాంటి చర్యలు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సునీత ఫిర్యాదుతో వర్రాపై మళ్లీ ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిణామం పులివెందులలో వైసీపీ నేతల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.