హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కూతురు వైఎస్ సునీత మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన తండ్రి హత్య కేసు విచారణను రోజువారీగా చేపట్టాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో సీబీఐతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్నవారినీ ప్రతివాదులుగా చేర్చారు.
ఈ మేరకు హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పటికే నాలుగేళ్లు గడుస్తున్నా విచారణలో పురోగతి లేదని పిటిషన్‌లో సునీత అభిప్రాయపడ్డారు. 2019 మార్చి 14 అర్ధరాత్రి హత్య జరిగిన తర్వాత సీబీఐ అధికారులు ఇప్పటికే రెండు ఛార్జీషీట్లు దాఖలు చేశారని సునీత తరఫు న్యాయవాది కోర్టులో తెలిపారు.
సీబీఐ కోర్టులో విచారణ కొనసాగుతోందని, దానిని వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేసేలా ఆదేశించాలని హైకోర్టును కోరారు. హార్డ్‌డిస్క్‌లు తెరుచుకోకపోవడం వల్ల విచారణ నిలిచిపోయిందని, దీంతో పదిహేను నెలలుగా విచారణ ముందుకు సాగడం లేదని న్యాయవాది వివరించారు.
ఈ కేసులో నిందితులందరికీ వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వడానికి అనుమతిస్తూ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.