మూవీడెస్క్: పుష్ప 2 ప్రీమియర్ సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట విషాదకరమైన ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటన సినీ ఇండస్ట్రీపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. ముఖ్యంగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి.
తల్లి చనిపోయి, 20 రోజులుగా శ్రీతేజ్ చావుబతుకుల మధ్య ఉంటే ఒక్క సినీ ప్రముఖుడైనా అతడిని పరామర్శించారా? అని రేవంత్ ప్రశ్నించారు.
దీంతో సినీ ఇండస్ట్రీపై ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతుండగా, నటుడు జగపతిబాబు స్పందించారు. తాను ఇప్పటికే ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించానని స్పష్టం చేశారు.
షూటింగ్ ముగించుకున్నాక వెంటనే ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ కుటుంబాన్ని కలిసాను. వారి కష్టాలు చూసి భాధపడ్డాను.
శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకున్నాను, అని జగపతిబాబు పేర్కొన్నారు. కానీ, ఈ విషయాన్ని ప్రచారం చేయలేదని, ఎందుకంటే ఇది ఒక బాధ్యతగా చేశానని చెప్పారు.
ఇంతలోనే మరికొందరు సినీ ప్రముఖులు, నిర్మాతలు అల్లు అరవింద్, సుకుమార్ కూడా ఆస్పత్రికి వెళ్లినట్లు వార్తలు వెలువడాయి.
కానీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ చర్చనీయాంశంగా మారాయి.