హైదరాబాద్: సంధ్య థియేటర్ దగ్గర జరిగిన విషాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కఠినంగా స్పందించారు.
పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ కారణంగా తల్లి రేవతి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని, సినీ ప్రముఖులు బాధ్యత రహితంగా ప్రవర్తించారని మండిపడ్డారు.
సీఎం రేవంత్ వివరిస్తూ.. థియేటర్ యాజమాన్యం, పోలీసులు రద్దీని దృష్టిలో ఉంచుకుని అనుమతి ఇవ్వకపోయినా, హీరో రోడ్డు షో చేస్తూ అభిమానులను ఆకర్షించడం భద్రతా సమస్యలకు దారితీసిందని అన్నారు.
ఈ తొక్కిసలాటలో తల్లి రేవతి చనిపోగా, ఆమె కొడుకు గాయపడిన ఘటనను ఆయన హృదయవిదారకంగా పేర్కొన్నారు. హీరో థియేటర్ లోపల ఉన్నప్పుడు పోలీసులు హెచ్చరించిన కూడా బయటకు వెళ్లలేదు.
చివరికి కేసు పెట్టాల్సి ఉంటుందని చెబితే వెళ్లిపోయారు. బయటకు వచ్చాక కూడా రోడ్ షో చేయడంతో పోలీసులు కేసు నమోదు చేయాల్సి వచ్చింది.
సినీ ప్రముఖులు బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రత్యేక షోలకు అనుమతిచ్చినప్పటికీ, ప్రాణాలకు ముప్పు తీసుకురావడాన్ని మేం క్షమించబోమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.