
ఏపీ: సీఎం చంద్రబాబు నాయుడు సూపర్-6 హామీల అమలుపై స్పష్టత ఇచ్చారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అమలు చేస్తామని చెప్పారు.
“మే నెలలో ‘తల్లికి వందనం’ పథకం ప్రారంభం అవుతుంది. ప్రతి ఇంట్లోని పిల్లల కోసం తల్లికి రూ.15 వేలు చొప్పున అందజేస్తాం. అలాగే, అన్నదాత పథకంలో రైతులకు కేంద్రం ఇచ్చే సాయంతో కలిపి మూడు విడతల్లో రూ.20 వేలు అందజేస్తాం” అని చంద్రబాబు వెల్లడించారు.
ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ త్వరలో నిర్వహిస్తామన్నారు. మరోవైపు, చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు కూడా రూ.20 వేలు సాయం ఇస్తామని ప్రకటించారు.
వైసీపీ నేతలు హామీల అమలుపై విమర్శలు చేస్తుండగా, చంద్రబాబు స్పష్టత ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.