ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ అస్వస్థత కారణంగా ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. గురువారం ఉదయమే కడుపు సంబంధిత సమస్యలతో అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు.
ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణుల కంట్రీ లో ఆమెకు అవసరమైన పరీక్షలు, చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
డాక్టర్ అజయ్ స్వరూప్ ప్రకటన ప్రకారం, సోనియా గాంధీకి ముఖ్యమైన పరీక్షలు పూర్తి అయ్యాయని, శుక్రవారం సాయంత్రం ఆమెను డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. కుటుంబ సభ్యులు కూడా ఆమె ఆరోగ్యంపై సంతృప్తి వ్యక్తం చేశారు.
గతంలో కూడా సోనియా గాంధీకి ఇలాంటి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ, ప్రతి సారి ఆమె త్వరగా కోలుకున్నారు. 78 ఏళ్ల వయస్సులోనూ ఆమె తన రాజకీయ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు.