న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్‌ను ఎనిమిది జట్లు కాకుండా పది జట్లతో విస్తరించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భావిస్తోంది. డిసెంబర్ 24వ తేదీన జరుగనున్న బీసీసీఐ ఏజీఎం సమావేశంలో ఐపీఎల్-2021ని పది జట్లతో నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోవడానికి బోర్డు పెద్దలు ఇప్పటికే సిద్ధమైనట్లే కనబడుతోంది.
పది జట్లతో ఐపీఎల్ ను నిర్వహించడం బీసీసీఐ బోర్డుకు కొత్త కాదు. తొమ్మిదేళ్ల క్రితమే పది జట్లు (పుణే వారియర్స్, కొచ్చి టస్కర్స్) ఐపీఎల్‌లో తలపడ్డాయి. అయితే ఈ పది జట్ల ముచ్చట 2013లోనే ముగిసింది. మళ్లీ ఏడేళ్ల తర్వాత విస్తరణ తెర మీదికొచ్చింది. దీనికి ప్రధాన కారణం అదానీ గ్రూప్.
ఇక ప్రస్తుతం పాల్గొనే ఎనిమిది జట్లు రౌండ్ రాబిన్ పద్దతిలో ఒక్కో జట్లతో రెండుసార్లు తలపడుతున్నాయి. దీంతో లీగ్ దశలో ఒక జట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుంది. ఐపీఎల్ 2021కి రెండు జట్లు వస్తే, ఈ పద్దతి ప్రకారం మ్యాచ్‌ల సంఖ్య 18కి చేరుకుంటుంది. అప్పుడు సుదీర్ఘ ఐపీఎల్ సీజన్ అవుతునందేది వాస్తవం. ఈ ఫార్మాట్ నిర్వహించడం కూడా బీసీసీఐకి పెద్ద తలనొప్పే. అందుకే లీగ్ దశలో అన్ని జట్లు 14 మ్యాచ్‌లే ఆడాయి.
అన్ని జట్లు లీగ్ దశలో 13 మ్యాచ్‌లకే పరిమితం చేయడంపై యోచిస్తోంది. పది జట్లను రెండు గ్రూపులు చేస్తారు. అంటే ఐదేసి జట్లతో ఒక గ్రూపు ఏర్పడుతుంది. ఇక్కడ ఒక్కో జట్టు తన బృందంలోని మరో జట్టుతో రెండు సార్లు తలపడుతుంది. ఆ రెండేసి మ్యాచ్‌లు హోమ్ గ్రౌండ్‌లో ఒకటి, బయట ఒకటి జరుగతాయి. అదే సమయంలో అవతలి గ్రూప్‌లోని జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అంటే లీగ్ దశలో ఒక్కో జట్టు 13 మ్యాచ్‌లు ఆడతుందన్నమాట. ఇన్ని అంశాలు పరిశీలనలో ఉండటంతో ఇదంతా గందరగోళంగానే కనిపిస్తోంది. మరి బీసీసీఐ అడుగు ఎలా ఉంటుందో అనేది ఆసక్తికరం.