కడప: కడపలో అగాడి వీధిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మధ్యాహ్నం స్కూల్ నుండి సైకిల్‌పై ఇంటికి తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు చిన్నారులు విద్యుదాఘాతానికి గురయ్యారు.
స్థానికులు వెంటనే స్పందించి, విద్యార్థులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ ఈ ప్రయత్నంలో 11 ఏళ్ల తన్వీర్ అనే విద్యార్థి కన్నుమూశాడు. మరో చిన్నారి పరిస్థితి ఇంకా విషమంగా ఉంది.
ఈ దుర్ఘటనకు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని, ఈ విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఘటన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి, ఇది స్థానికుల ఆగ్రహాన్ని మరింత పెంచింది.
ఈ విషాదకర సంఘటనపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన్వీర్ మృతి తనను కలచివేసిందని, గాయపడిన మరో విద్యార్థికి అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు.
అలాగే, ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.