అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఇవాళ పీఆర్సీ నివేదికను కమిటీ అందించింది. ఏపీ సీఎస్ డాక్టర్ సమీర్ శర్మతో పాటు రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్) శశిభూషణ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, సీఎంవో అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను సీఎస్ కమిటీ సిఫార్సు చేసింది.
11వ వేతన సంఘం సిఫార్సులపై సీఎస్ కమిటీ తమ సిఫార్సులు ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కూడా ఈ నివేదికలో కమిటీ ప్రస్తావన చేసింది. 2018-19 ఆర్థిక సంవతసరంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల రూపేణా చేసిన వ్యయం రూ.52,513 కోట్లు. 2020-21 నాటికి వ్యయం రూ.67.340 కోట్లు. 2018-19లో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల మొత్తం 84 శాతం. 2020-21 నాటికి 111 శాతానికి చేరుకుందని నివేదిక తెలిపింది.
ప్రభుత్వ మొత్తం వ్యయంలో ఉద్యోగులకు ఇచ్చే జీతాలు, పెన్షన్ల కోసం చేస్తున్న వ్యయంలో 2018-19లో 32 శాతంగా ఉండగా, 2020-21 నాటికి 36 శాతానికి చేరింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ వ్యయం ఏపీలోనే అధికమని నివేదిక తెలిపీంది. 2020-21లో తెలంగాణలో ఇది కేవలం 21 శాతమేనని’’ కమిటీ పేర్కొంది.
పరిపాలనా సంస్కరణలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చి 1.28 లక్షల మంది శాశ్వత ఉద్యోగులను తీసుకుంది. ఏడాదికి రూ.2300 కోట్ల భారం ప్రభుత్వంపై పడింది. ఆరోగ్య రంగంలో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని నియమించాం. దీని వల్ల అదనంగా ఏడాదికి ప్రభుత్వంపై రూ.820 కోట్ల భారం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం అప్కాస్‌ను ప్రారంభించారు. అప్కాస్ రూపంలో ఏడాదికి ప్రభుత్వంపై రూ.2040 కోట్ల భారం పడిందని కమిటీ తమ నివేదికలో పేర్కొంది.