లక్నో: అసలే దేశం మొత్తం మీద కోవిడ్ కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. మహరాష్ట్ర, కేరళ, చండీగఢ్ రాష్ట్రాల్లో అధికంగా కేసులు బయట పడుతున్నాయి. ఇలాంటి సమయంలో నిర్వహించిన కుంభమేళాలో కరోనా కేసులు చాలా అధికంగా పెరిగిపోతున్నాయి.
ఈ నెల 10వ తేదీ నుండి 14వ తేదీల మధ్య 2,36,751 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వాటిలో 1,701 మంది కరోనా పాజిటివ్ గా తేలారు. కాగా మరిన్ని ఆర్టీపీసీఆర్ నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. కాగా, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గంగానది తీరాన నిర్వహించే కుంభమేళా ఏప్రిల్ 1 నుండి ఈనెల 30వ తేది వరకు జరుగనున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగెటివ్ సర్టిఫికేట్ ఉన్న యాత్రికులను మాత్రమే పవిత్ర స్నానాలకు అనుమతిస్తున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా ఏప్రిల్ 12,14,27 తేదిల్లో షాహీస్నాన్ కూడా నిర్వహిస్తారు. ఈ రోజుల్లో భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరిస్తారు. గత 12 వ తేదినాటి షాహీస్నాన్ కార్యక్రమం వలన భక్తులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడ్డారని ఉత్తరఖండ్ ప్రభుత్వం భావిస్తుంది. కాగా, కుంభమేళ 670 హెక్టార్లలో హరిద్వార్, టెహ్రీ, డెహ్రాడూన్ జిల్లాలలో విస్తరించి ఉంది.
ఏప్రిల్ 12న సోమవతి అమావాస్య సందర్భంగా జరిగిన షాహిస్నాన్‌లో పాల్గొన్న 48.51 లక్షల మందిలో చాలా మంది కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, అక్కడ ప్రభుత్వం, వైద్య సిబ్బంది, పారామిలటరీ సిబ్బంది, కరోనా నిబంధనలు పాటించేలా, భక్తులకు వారికి కేటాయించిన స్లాట్ సమయాల్లోనే పవిత్ర స్నానాలను ముగించుకొవాల్సిందిగా ఆదేశాలను జారీ చేసింది.