ముంబై: యూకేలో ఇటివల గుర్తించిన కొత్త రకమైన కరోనా వైరస్ భారత్‌లో కూడా అడుగుపెట్టిందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటివల లండన్ నుంచి భారత్ లోని వివిధ రాష్ట్రాలకు వచ్చిన విమాన ప్రయాణికులకు జరిపిన కోవిడ్ పరీక్షల్లో 20 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.
కాగా, వారికి కొత్తగా బయటపడిన వైరస్ స్ట్రెయిన్ ఉందా, లేదా అనేది ప్రత్యేకంగా పరీక్షించి, నిర్ధారించాల్సి ఉంటుంది. బ్రిటన్ నుంచి సోమవారం రాత్రి ఢిల్లీకి వచ్చినవారిలో ఆరుగురికి, ఆదివారం రాత్రి కోల్‌కతాకు వచ్చినవారిలో ఇద్దరికి, మంగళవారం అహ్మదాబాద్ వచ్చినవారిలో నలుగురికి, పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు సోమవారం వచ్చినవారిలో విమాన సిబ్బందిలో ఒకరికి సహా ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ఈ ప్రయాణికులంతా లండన్ నుంచి ఎయిర్‌ఇండియా విమానాల్లో నేరుగా వారి సొంత నగరాల విమానాశ్రయాలకు వచ్చినవారే. పాజిటివ్ గా తేలిన ఆ 20 మందిని ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌లోనే ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందిస్తున్నారు. తాజాగా బ్రిటన్ నుంచి భారత్ వచ్చిన విమాన ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
లండన్ నుంచి ఢిల్లీకి సోమవారం రాత్రి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో ఐదుగురికి కరోనా సోకినట్లు తేలిందని ఒక అధికారి తెలిపారు. ఢిల్లీ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్‌లో చెన్నైకు వెళ్లిన మరో వ్యక్తికి కూడా పాజిటివ్‌గా నిర్ధారించారు. లండన్ నుంచి ఢిల్లీకి మంగళవారం ఉదయం వచ్చిన విమాన ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించారు. బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ఆ దేశం నుంచి విమానాల రాకపోకలపై భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే.
బ్రిటన్ నుంచి మంగళవారం భారత్ కు మూడు విమానాల్లో సుమారు 590 మంది ప్రయాణికులు ముంబై వచ్చారు. అయితే, ఈ ప్రయాణికుల్లో కరోనా లక్షణాలున్న వారెవరూ లేరని ఒక అధికారి తెలిపారు. ఆ 590 మందిలో ముంబైకి చెందినవారు 187 మంది, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల వారు 167 మంది, ఇతర రాష్ట్రాలకు చెందినవారు 236 మంది ఉన్నారన్నారు.