అమరావతి: కేంద్ర ప్రభుత్వం 2019 నుండి రైతులకు ఆర్థికంగా భరోసా ఇవ్వడం కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే ఒక పథకాన్ని ప్రవేశ పెట్టింది. దీనితో ప్రతి సంవత్సరం రైతుల ఖాతాలో నేరుగా ఆరు వేల రూపాయలను కేంద్రం జమ చేస్తుంది.
ఈ 6000 రూపాయలను రైతులకు ప్రభుత్వం మూడు విడతలుగా అందజేస్తుంది. అంటే ప్రతి ఒక విడతలో రైతులకు రెండు వేల రూపాయలు లభిస్తాయి. మొదటి విడత ఏప్రిల్ 1 నుండి జూలై 31, రెండవ విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు కాగా మూడవ విడత డిసెంబర్ 1 నుండి మార్చి 31 వరకు ఉంటుంది. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రైతుల ఖాతాలోకి 7 విడతలలో నగదును జమ చేసింది.
తాజాగా 8వ విడత డబ్బులను అందించేందుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అయ్యింది. ఈ నగదును ఏప్రిల్ 1 నుంచి జూలై 31 మధ్యలో దశల వారీగా రైతుల ఖాతాలలోకి జమ చేయనుంది. ఈ పథకంలో ఇప్పటి వరకు చేరని వారు మార్చి 31లోపు మీ పేరును పీఎం కిసాన్ అర్హుల జాబితాలో నమోదు చేసుకోవాలి.
ఇప్పుడు నమోదు చేయించుకోవడం వల్ల ఎనిమిదవ విడత నగదు మీ ఖాతాలో పడతాయి. అయితే, డబ్బులు మీకు వస్తాయా రావా అనేది తెలుసుకోవాలంటే మీ పేరు బెనిఫీసియరీ లిస్టులో ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఒక వేళ ఆ లిస్టులో పేరు లేకపోతే డబ్బులు రావు. కేవలం అందులో ఉన్నవారికి మాత్రమే డబ్బులు జమ చేస్తుంది. ఇందుకోసం పీఎం కిసాన్ వెబ్ సైట్లో శోధించాల్సి ఉంటుంది.