హైదరాబాద్: 2030కి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యం: భట్టి విక్రమార్క
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ప్రకటించారు. ఐఐటీలు కేవలం విద్యాసంస్థలు మాత్రమే కాకుండా, దేశ నిర్మాణానికి కీలక వేదికలుగా ఉంటాయని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ ఐఐటీలో నిర్వహించిన “ఆస్ట్రేలియా-ఇండియా క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ హబ్” వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు. ఐఐటీల ఆవిష్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఒరవడి సృష్టిస్తాయని, 11,500 పైగా పరిశోధన ప్రచురణలు, 320 పైగా పేటెంట్లు, స్టార్టప్‌ల ద్వారా రూ.1,500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం గొప్ప ఘనతగా అభివర్ణించారు.
ఆస్ట్రేలియా-ఇండియా భాగస్వామ్యంపై ప్రత్యేక దృష్టి
క్లిష్టమైన ఖనిజాల పరిశోధనల్లో ఆస్ట్రేలియా మోనాష్ యూనివర్సిటీతో కలిసి తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని భట్టి చెప్పారు. ఈ కృషి కేవలం రాష్ట్రానికే కాకుండా దేశానికి, అంతర్జాతీయ వేదికలకు ఎంతో విలువైనదని తెలిపారు. క్లిష్టమైన ఖనిజాలను పారిశ్రామిక మరియు హరిత ఆర్థిక వ్యవస్థల పునాదిగా అభివృద్ధి చేయడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
ఐఐటీ హైదరాబాద్ – కలల కర్మాగారం
ఐఐటీ హైదరాబాద్ ఆధునిక ఆవిష్కరణలకు చిరునామాగా నిలుస్తోందని, ఇక్కడి పరిశోధన ఫలితాలు సమాజానికి అమూల్యమైనదని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. పండిట్ నెహ్రూ ఐఐటీలను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించారనే ఆయన వ్యాఖ్యలను గుర్తుచేశారు.
క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ
తెలంగాణలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని తెలంగాణ ప్రభుత్వం విశేష ప్రాధాన్యతనిచ్చిందని చెప్పారు. 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా నిలుస్తామని, గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ భవిష్యత్తు ఇంధనంగా మారుతుందని తెలిపారు.
స్థిరమైన టెక్నాలజీపై నిబద్ధత
విభిన్న పరిశోధనలు, శాస్త్రీయ ఆవిష్కరణల ద్వారా తెలంగాణను దేశంలో మొదటి స్థానంలో నిలపడం ప్రభుత్వ లక్ష్యమని భట్టి పేర్కొన్నారు. సోలార్ పవర్ ప్యానెల్స్, విండ్ టర్బైన్లు, విద్యుత్తు నిల్వ బ్యాటరీలు వంటి పరికరాలు క్లిష్టమైన ఖనిజాల ద్వారానే నిర్మాణం అవుతాయని స్పష్టం చేశారు.