జాతీయం: 2024 ప్రపంచంలోని ఉత్తమ కంపెనీల జాబితాలో భారత్ కంపెనీలకు చోటు
2024 సంవత్సరానికి గానూ, ప్రముఖ గ్లోబల్ ఇండస్ట్రీ ర్యాంకింగ్ పోర్టల్ స్టాటిస్టా సహకారంతో రూపొందించిన టైమ్ మ్యాగజైన్ జాబితాలో అదానీ గ్రూప్ ప్రాధాన్యతను చాటుకుంది.
ఈ జాబితా ఉద్యోగుల సంతృప్తి, ఆదాయ వృద్ధికి కంపెనీల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 50 కంటే ఎక్కువ దేశాల సర్వేలో 1,70,000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సర్వేలో పని పరిస్థితులు, వేతనం, సమానత్వం వంటి కీలక అంశాల ఆధారంగా కంపెనీలు ఎంపికయ్యాయి.
భారతదేశానికి చెందిన మొత్తం 22 సంస్థలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అయితే, అంబానీ లేదా అదానీ గ్రూప్ అగ్రస్థానంలో ఉంటాయని ఆశించిన వారికి ఆశ్చర్యం కలిగిస్తూ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ భారతదేశపు అగ్రగామి సంస్థగా 112వ ర్యాంక్‌ను సాధించింది.
తర్వాతి స్థానాల్లో ఇన్ఫోసిస్ (119వ ర్యాంక్), విప్రో (134వ ర్యాంక్), మహీంద్రా గ్రూప్ (187వ ర్యాంక్) ఉన్నాయి.
భారత బ్యాంకింగ్ విభాగంలో యాక్సిస్ బ్యాంకు 504వ ర్యాంక్‌తో ముందంజలో ఉండగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 518వ ర్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ 525వ ర్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ 551వ ర్యాంక్ దక్కించుకున్నాయి.
భారీ అంచనాలు ఉన్నా, రిలయన్స్ ఇండస్ట్రీస్ 646వ ర్యాంక్‌కి, అదానీ గ్రూప్ 736వ ర్యాంక్‌కి పరిమితమయ్యాయి.
అదానీ గ్రూప్, ఎనిమిది ప్రధాన లిస్టెడ్ కంపెనీలతో పాటు మరిన్ని అనుబంధ సంస్థలతో దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపార సమూహంగా కొనసాగుతోంది. ఈ సంస్థలు పర్యావరణ, సామాజిక మరియు పాలనా స్థిరత్వం (ESG) మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపింది.
అదానీ గ్రూప్ యొక్క 11 కంపెనీలలో ఎనిమిది కంపెనీలు వాణిజ్యపరంగా అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచాయి. మొదటి త్రైమాసికంలో గ్రూప్ నికర లాభం 50.1% పెరిగి రూ. 10,279 కోట్లు చేరింది. EBITDA కూడా 32.9% వృద్ధిని సాధించింది.
2023 నాటికి 100 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని కలిగిన సంస్థలు మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.