fbpx
Monday, December 23, 2024
HomeBusiness21 రాష్ట్రాలు జీఎస్టీ ఆప్షన్-1 కే మొగ్గు

21 రాష్ట్రాలు జీఎస్టీ ఆప్షన్-1 కే మొగ్గు

21-STATES-CHOSE-GST-OPTION1

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావంతో ఏర్పడిన జీఎస్టీ లోటు భర్తీకి సంబంధించి 21 రాష్ట్రాలు కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించిన “ఆప్షన్ 1” ను ఎంచుకున్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జీఎస్టీ ప్రతిపాదించిన రుణాలు తీసుకోవడానికే ఈ రాష్ట్రాలు నిర్ణయించాయి. తద్వారా ఆర్థిక మంత్రిత్వ శాఖ సమన్వయంతో ఒక ప్రత్యేక విండో కింద రుణాల ద్వారా 97,000 కోట్ల అంచనా లోటును అప్పుగా తీసుకోవడానికి వీలు కల్పిస్తుందని వెల్లడించాయి.

ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు అందించిన సమచారం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్న వాటిల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న పాండిచేరి ఒకటి కావడం విశేషం. ఇంకా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి.

దీనికి సంబంధించి ఇతర కాంగ్రెస్ లేదా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తమ నిర్ణయాన్ని ప్రకటించలేదని తెలిపాయి. అలాగే మిగిలిన రాష్ట్రాలు అక్టోబరు 5న జరగనున్న కౌన్సిల్ సమావేశాని కంటే ముందు తమ నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లేదంటే బకాయిల కోసం జూన్, 2022 వరకు వేచి ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి.

కాగా జీఎస్టీ అమలు ద్వారా రాష్ట్రాలు నష్టపోతున్న మొత్తం 97,000 కోట్లుగా లెక్కించాం. ఆ మొత్తాన్ని రాష్ట్రాలు కేంద్ర ఆర్థికశాఖ ఏర్పాటు చేసిన స్పెషల్ విండో ద్వారా రుణం రూపంలో పొందవచ్చు అని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభలో ప్రకటించారు. కోవిడ్ నష్టాన్ని కలుపుకుంటే మొత్తం లోటు రూ. 2,35,000 కోట్లుగా లెక్కించామనీ, ఈ మొత్తాన్ని రాష్ట్రాలు మార్కెట్ నుంచి రుణాలు పొందడం రెండో ఆప్షన్ గా పేర్కొన్నారు.

ఈ రుణం తిరిగి కేంద్రం చెల్లిస్తుందని, కానీ వడ్డీని రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంద న్నారు. రాష్ట్రాలు ఈ రెండు విధానాల్లో ఏదైనా ఎంచుకోవచ్చనీ, 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కూలంకుషంగా చర్చించామనీ ఆమె తెలిపారు. రాష్ట్రాలకు రెండు ఆప్షన్స్ ఇచ్చామని ఆర్థికమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular