బెంగళూరు: కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుఊనే ఉంది. సెకండ్ వేవ్‌తో దేశంలో కరోనా బాధితులు ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే విధంగ, తాజాగా కర్ణాటకలో మరో మరణం నమోదయింది. ఒక కరోనా ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో 24 మంది కరోనా రోగులు మృతి చెందారు. చామరాజనగర్‌లో ఉన్న కోవిడ్ ఆస్పత్రిలో ఆదివారం ఈ ఘటన జరిగింది.
చనిపోయిన కోవిడ్ బాధితులందరూ ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్నట్లు తెలుస్తోంది. ఆక్సిజన్ సరఫరా ఆగడంతోనే మరణించారని మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి అధికారులు ఈ ఘటనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు.
ఆస్పత్రిలో ఆక్సిజన్ కు ఎలాంటి కొరత లేదని, మైసూరు నుంచి ఆక్సిజన్ తెప్పించినట్లు ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలు మృతి చెందిన వారి పోస్టుమార్టం నివేదికలు వస్తే బయటపడతాయని అన్నారు. కాగా మృతి చెందిన రోగులు వెంటిలేటర్లపై ఉన్నారని, అదీ కాక వారికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని చామరాజనగర్ డిప్యూటీ కమిషనర్ ఎం.ఆర్.రవి వెల్లడించారు.
అయితే చనిపోయిన వారంతా కచ్చితంగా ఆక్సిజన్ కొరతతో మరణించారా లేదా అన్న అంశం ఇంఖా తేలాల్సి ఉందన్నారు. ఈ విషాద ఘటనపై స్పందించిన కర్ణాటక సీఎం యడియూరప్ప, చామరాజనగర్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.