తైవాన్ : ఒక ఘోర రైలు ప్రమాదం తూర్పు తైవాన్‌లో జరిగి తీవ్ర ప్రాణ నష్టం కలిగించింది. దాదాపు 350 మంది ప్రయాణికులు ఉన్న ఒక రైలు శుక్రవారం ఉదయం పట్టాలు తప్పడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో 36 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇంకా దీనిలో ప్రయాణిస్తున్న వారిలో 72 మంది గాయపడ్డారని అక్కడి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా మృతుల సంఖ్య 36 కంటే ఎక్కువ ఉండొచ్చని, ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే అందోళన ఎక్కువవుతోంది.
అధికారిక సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం సరిగ్గా పార్క్ చేయని ఒక ట్రక్ రైలు పట్టాల పైకి జారిపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తైటంగ్‌కు ప్రయాణిస్తున్న ఈ రైలు హువాలియన్‌కు ఉత్తరాన ఉన్న ఒక సొరంగంలో పట్టాలు తప్పింది.
ఇంకా అక్కడ సహాయ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని అధికారిక వర్గాలు ప్రకటించాయి. కాగా ఆ రైలు సొరంగం మధ్యలో ఇరుక్కోవడం వల్ల రక్షణ చర్యలు చాలా కష్టంగా ఉన్నాయని రక్షక వర్గాలు తెలిపాయి.