న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు చకచక జరుగుతున్నాయి. ఆగష్టు 5న రామ మందిర నిర్మాణానిక్ నాంది పలకబోతోంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు.
ఈ బృహత్తర కార్యానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరియు ఇతర ప్రముఖులు 50 మందిని ఆహ్వానించినట్లు ట్రస్టు వివరించింది. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రముఖుల్లో బీజేపీ పెద్దలైన నేతలు అడ్వాణీ, ఎంఎంజోషీలూ ఉన్నారని తెలిపింది.
భూమి పూజలో భాగంగా 40 కిలోల బరువైన వెండి ఇటుకను ప్రధాని మోడీ శ్రీరామ మందిరం యొక్క పవిత్ర స్థలంలో ఉంచుతారని ఆలయ ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ తెలిపారు.
ప్రధాన భూమిపూజ కార్యక్రమానికి మూడు రోజులు ముందుగా ఆగస్టు 3వ తేదీ నుంచే వేదోక్తంగా కార్యక్రమాలు మొదలవుతాయి. 4న రామాచార్య పూజ, ఆగస్టు 5వ తేదీ మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రధానమైన భూమిపూజకు ముహూర్తం ఖరారైంది.
కరోనా వైరస్ కారణంగా ఆహ్వానితులు భౌతిక దూరం పాటించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వీలుగా అయోధ్యలో పెద్ద సంఖ్యలో భారీ స్క్రీన్ల టీవీలను ఏర్పాటు చేస్తారు’అని వివరించారు. రామాలయ మందిర నిర్మాణ ఉద్యమంతో సంబంధమున్న బీజేపీ నేతలుసహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారని తెలిపారు.