హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేసులు పెరుగుతాయని భావించామని, కాగా అవి పెరగకపోగా కేసులు తగ్గడం చాలా ఊరట కలిగిస్తోందని తెలిపింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలపై ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యశాఖ సమగ్ర నివేదికను అందించింది.
రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 22 రోజుల వ్యవధిలో సగానికి తగ్గినట్లు తెలిపింది. ఆ నివేదిక ప్రకారం గత నెల 19వ తేదీన 39,448 మందికి కరోనా పరీక్షలు చేయగా, 894 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే కరోనా పాజిటివిటీ రేటు 2.27 శాతంగా ఉంది. ఇక ఈ నెల 10వ తేదీన 56,178 మందికి పరీక్షలు చేయగా, 612 మందికి కరోనా సోకింది. అంటే పాజిటివిటీ రేటు 1.09 శాతానికి పడిపోయిందని తెలిపింది. రోజువారీగా చేస్తున్న పరీక్షల సంఖ్య పెరిగినా.. కొత్త కేసులు తగ్గుముఖం పట్టడం గమనార్హం. దేశంలోనూ కరోనా ఉధృతి తగ్గిందని, అదే ప్రభావం తెలంగాణలోనూ కనిపిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.
ప్రభుత్వం 300 మొబైల్ టెస్టింగ్ వాహనాలను రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేసింది. ప్రమాదం ఎక్కువ ఉన్న మార్కెట్లు, రైతు బజార్లు, ఆటోస్టాండ్లు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు తదితర ప్రాంతాలకు వెళ్లి ఈ వాహనాల ద్వారా కరోనా పరీక్షలు చేయాలి. అయితే అవి పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని నివేదికలో స్పష్టం చేశారు.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గాయి. ప్రజలు, ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తల వల్లే ఇది సాధ్యమైంది. వేగంగా కేసులను గుర్తించడం వల్ల అటువంటి వ్యక్తులు ఐసోలేషన్ అయ్యారు. దీంతో వైరస్ ఇతరులకు వ్యాపించలేదు. పైపెచ్చు అక్కడక్కడ పాక్షికంగా హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చింది. అందువల్ల కూడా కేసులు తగ్గినట్లు భావిస్తున్నామని తెలిపారు.