హైదరాబాద్: హైదరాబాద్ లో ఒక వైపు జిహెచ్ఎంసీ ఎన్నికల సందడి పుంజుకుంటోంది, దానికి తోడు జంటనగర వాసులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 50 శాతం బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
దీనివల్ల నగరంలోని అన్ని రూట్లలో ఈ రోజు నుంచి ఆర్టీసీ బస్సుల సర్వీసుల సంఖ్య పెరగనున్నాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకూ గ్రేటర్ పరిధిలో 25శాతం బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 శాతం బస్సులు తిప్పుతున్నట్లు తెలిపిన గ్రేటర్ ఆర్టీసీ వెల్లడించింది.
అలాగే బస్ పాస్ కౌంటర్లను కూడా 26కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉదయం 7.30 నుండి రాత్రి 8.15 వరకు బస్ పాస్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాగా కరోనా వైరస్ లాక్డౌన్ తర్వాత ప్రజా రవాణాకు కేంద్రం పూర్తి స్థాయిలో అనుమతి ఇచ్చినప్పటికీ తెలంగాణాలో వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా 25 శాతం బస్సులకు మాత్రమే అనుమతినిచ్చింది.
ఇప్పుడు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య చాలా వరకు తగ్గిందంటూ సర్కార్ తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో కరోనా మహమ్మారి కారణంగా సంక్షోభంలో పడిన ఆర్టీసీ ఆదాయం భారీగా పుంజుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు గత ఎనిమిది నెలలుగా మూతపడిన సినిమా థియేటర్లను తెరుచుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.