వాషింగ్టన్: ఇటీవలే 53.3 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల వ్యక్తిగత డేటా లీకైంది. ఆ ఘటన మరవక ముందే తాజాగా సోషల్ మీడియా లింక్డ్‌ఇన్ యూజర్ల డేటా లీక్ అయింది. సైబర్‌న్యూస్ ప్రచురించిన వార్త ప్రకారం, 50 కోట్లకు పైగా లింక్డ్ఇన్ వినియోగదారుల డేటా డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉన్నట్లు తెలిపింది.
కాగా లీక్ అయిన సమాచారంలో లింక్డ్ఇన్ యూజల యొక్క ఐడి, పూర్తి పేర్లు, ఇమెయిల్ చిరునామాలు, ఫోన్ నంబర్లు, జెండర్, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ మరియు ఇతర కీలక వివరాలు ఉన్నాయి. ఈ మేరకు 50 కోట్ల మంది వివరాల్ని హ్యాక్ చేసిన సైబర్ నేరగాడు దాన్ని ఓ వెబ్‌సైట్‌లో అమ్మకానికి ఉంచినట్లు సైబర్‌న్యూస్ అనే వార్తా సంస్థ పేర్కొంది.
ఈ సమాచారాన్ని సదరు హ్యాకర్ బిట్‌కాయిన్లకు విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. లీకైన డేటా లింక్డ్‌ఇన్ యూజర్ల ఫొఫైళ్ల నుంచి హ్యాక్ చేసినవి కాదని లింక్డ్‌ఇన్ తెలిపింది. కొన్ని ఇతర వెబ్‌సైట్లు, కంపెనీల నుంచి సేకరించిన వివరాల సమాహారమని ఇది పేర్కొంది. దాదాపు 50 కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారం ఆన్‌లైన్‌లో కనిపించడం జరిగిన కొద్ది రోజులకే ఇది జరగడం యూజర్ల భద్రత విషయంలో పలు అనుమానాలు రేపుతోంది.