న్యూఢిల్లీ: 5జీ, ఇప్పుడు టెక్నాలజీ రంగంలో వినపడుతున్న కొత్త పేరు. ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్న ఇంటర్నెట్ సాంకేతిక పరిణామం. టెలీ కమ్యూనికేషన్ రంగంలో రాబోయే రోజుల్లో భారత ఐటీ కంపెనీలకు అవకాశాల పంట పండించనున్నది. కరోనా వల్ల దేశంలో 5జీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది.
ప్రపంచంలోని అన్ని దేశాలలో ఒకవేళ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకోని వస్తే క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీల మీద పని చేస్తున్న టెక్ కంపెనీలకు చాలా భారీ అవకాశాలు అందనున్నాయి. ఈ 5జీ టెక్నాలజీ వల్ల మన దేశంలోని ఐటీ దిగ్గజాలకు 30 బిలియన్ డాలర్ల విలువైన అవకాశాలు లభిస్తాయని ఒక అంచనా.
ఇప్పటికే భారతదేశంలో 5జీ రంగంలో పని చేస్తున్న టెక్ మహీంద్రా వంటి ఐటీ దిగ్గజ కంపెనీలు భారీగా లబ్ధి పొందనున్నాయి. మొదటి దశలో టెలికాం ప్రొవైడర్ల నెట్‌వర్క్ ఆధునీకరణ, ఎక్విప్‌మెంట్ రూపకల్పన వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ టెక్నాలజీలో ఎలాంటి మార్పులు సంభవించినా పరికరాలు తయారీచేసే కంపెనీలకు, సర్వీస్ ప్రొవైడర్లకు మంచి అవకాశాలు లభిస్తాయి.
ఈ 5జీ టెక్నాలజీ వల్ల పలు కొత్త ఉత్పత్తులను తయారు చేయడానికి, మరియు సంబంధిత నూతన సేవలు అందుబాటులోకి తేవడానికి భారీగా వాల్యూక్రియేషన్ అవకాశాలు ఐటీ దిగ్గజాలకు లభిస్తాయని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కమ్యూనికేషన్స్, మీడియా అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇండస్ట్రీ గ్రూప్ అధ్యక్షుడు కమల్ భాడాడా వ్యాఖ్యానించారు. హై డెఫినిషన్ వీడియో కాన్ఫరెన్సింగ్ అండ్ సాఫ్ట్‌వేర్ కోసం టీసీఎస్ కసరత్తు చేస్తున్నట్లు కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.