అమరావతి: రాబోయే నాలుగేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో ప్రతి ఏటా 6,500 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. పోలీసు సంక్షేమ నిధికి మూడేళ్లుగా ఇవ్వాల్సిన నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.
బుధవారం విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పోలీసు అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీసులపై ముద్రించిన ‘అమరులు వారు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, ‘పోలీసు అమర వీరుల కుటుంబాలకు సంపూర్ణ న్యాయం చేస్తామని మాట ఇస్తున్నా. అమరులైన ప్రతి ఒక్కరి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు మంచి జరగాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నా’ అన్నారు. శాంతి భద్రతే లక్ష్యంగా పని చేస్తున్నామని అందుకు పోలీసు శాఖలో ఉన్న ఖాళీలను ప్రతి ఏటా 6500 చొప్పున ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డిసెంబర్ లో విడుదల చేస్తామని తెలిపారు.
కోవిడ్ సమయంలో గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది, పారిశ్యుద్ధ సిబ్బంది తో పాటు పోలీసులు తీవ్ర ఒత్తిడిలో అద్భుతంగా పని చేశారని వారిని ఈ సందర్భంగా అభినందించారు.