హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో దాదాపు 6.6 లక్షల మందికి కరోనా వచ్చి.. వెళ్లిపోయిందా? లక్షణాలు లేకపోవడంతో తమకు వైరస్ సోకిన విషయం కూడా చాలామందికి తెలియదా? అంటే ఔననే అంటున్నారు చాలా మంది పరిశోధకులు.
హైదరాబాద్‌లో కోవిడ్ కేసుల సంఖ్యపై సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) సమ్యుక్తంగా జరిపిన ఒక అధ్యయనంలో ఈ ఆసక్తికరమైన, ఆశ్చర్యానికి గురిచేసే విషయాలు వెలుగు చూశాయి. నగరంలోని మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి మానవ వ్యర్థాలు, నీటి నమూనాలు సేకరించి విశ్లేషించారు.
దాదాపు 2 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డట్టు గుర్తించారు. అయితే, నగర జనాభా ద్వారా విసర్జితమయ్యే మురుగులో 40 శాతం మాత్రమే శుద్ధి కేంద్రాలకు చేరుతోంది, అలా మిగిలిన మురుగునూ లెక్కలోకి తీసుకుంటే సుమారు 6.6 లక్షల మందిలో వైరస్ ఉండొచ్చని అంచనా వేశారు. వీరిలో ఇప్పటికే అధికశాతం మంది వైరస్ నుంచి కోలుకున్నారని, ప్రస్తుతం కొద్ది శాతం మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. మరోవైపు మురుగునీటి ద్వారా వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశం లేదని స్పష్టం చేశారు.
కరోనా బాధితుల నుండి దగ్గు, తుమ్ముల ద్వారా వైరస్ ఇతరులకు వ్యాప్తిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే వీటితోపాటు మలమూత్రాల ద్వారా కూడా వైరస్ పరిసరాల్లోకి చేరుతుంది. వైరస్ బారినపడ్డ తరువాత కనీసం 35 రోజుల వరకు వీరు వైరస్ అవశేషాలను వ్యర్థాల ద్వారా బయటకు వదులుతుంటారు.
ఈ కారణంగానే సూక్ష్మజీవుల ద్వారా వచ్చే వ్యాధులు ఎంత మేరకు విస్తరించాయో తెలుసుకునేందుకు మురుగునీటి విశ్లేషణను ఒక మేలైన మార్గంగా నిపుణులు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో సీసీఎంబీ, ఐఐసీటీ సంయుక్తంగా హైదరాబాద్‌లో ఎంతమందిలో వైరస్ ఉందో సుమారుగా తెలుసుకునేందుకు పరిశోధన చేపట్టాయి. హైదరాబాద్‌లో రోజుకు 180 కోట్ల లీటర్ల నీరు వినియోగిస్తుండగా, ఇందులో 40 శాతం నీటిని వేర్వేరు ప్రాంతాల్లోని మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేస్తుంటారు.
వీటిల్లో ప్రధానమైన కొన్ని కేంద్రాల నుంచి సీసీఎంబీ, ఐఐసీటీలు మురుగునీటి నమూనాలు సేకరించి పరిశీలించాయి. శుద్ధీకరించే ముందు నీటిలో కరోనా వైరస్‌జన్యు పదార్థపు ఆనవాళ్లు కనిపించగా, శుద్ధి తరువాత మాత్రం దాదాపు లేకుండా పోయాయని సీసీఎంబీ తెలిపింది.