న్యూఢిల్లీ: భారతదేశంలోని ప్రతి కుటుంబానికి ఒక బ్యాంక్ ఖాతా ఉండాలని, ప్రజలందరినీ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేయడం కోసం ఉద్దేశించిన ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన(పీఎంజేడీవై) ద్వారా ఇప్పటి వరకు 403.5 మిలియన్ ఖాతాలు తెరచినట్లు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది.
ఈ అకౌంట్లలో ఇప్పటి వరకు లక్షా ముప్పై వేల కోట్లకు పైగా డబ్బు డిపాజిట్ అయినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. కాగా సంక్షేమ పథకాల లబ్దిదారులు, పేదలకు ప్రత్యక్ష నగదు బదిలీ చేసేందుకు నరేంద్ర మోదీ సర్కారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం విదితమే. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తన ప్రసంగంలో భాగంగా 2014లో ఈ పథకం గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశారు.
జన్ ధన్ యోజన ఖాతాదారులందరికీ ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన తదితర పథకాల కింద ఇన్పూరెన్స్ సౌకర్యం కల్పించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఇప్పటికే వివిధ బ్యాంకులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
అదే విధంగా ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం, రూపే డెబిట్ కార్డు వినియోగాన్ని పెంచడం, మైక్రో క్రెడిట్ కార్డు, మైక్రో ఇన్వెస్ట్‌మెంట్ సౌకర్యం కల్పించడం తదితర కార్యకలాపాలను ముమ్మరం చేయనుంది.