అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో 18 ఏళ్ల వయసు పైబడిన జనాభాలో దాదాపు 93.94 శాతం మందికి కరోనా రెండు డోస్‌ల వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. మిగిలిన వారికి కూడా ఈ నెల చివరికల్లా పూర్తి చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇంత పెద్ద మొత్తంలో టీకాల ప్రక్రియలు జరగడంవల్లే రాష్ట్రంలో కోవిడ్ మూడో దశలో లక్షణాల తీవ్రత, మరణాల శాతం చాలా తక్కువగా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది.
కాగా అదే సమయంలో రాష్ట్రంలో 15 ఏళ్ల వయసు నుంచి 18 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు మొదటి డోసు నూరు శాతం పూర్తయిందని తెలిపింది. 18 ఏళ్ల పైబడిన వారికి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రెండు డోసులు నూటికి నూరు శాతం పూర్తవగా, రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో 90 శాతానికి పైగా పూర్తయింది.
కాగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తవడంవల్ల కోవిడ్ మూడవ వేవ్‌లో మరణాల సంఖ్య దేశంతో పాటు మరే ఇతర రాష్ట్రాలతో పోల్చినా చాలా తక్కువగా నమోదయ్యాయి. అలాగే కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి కూడా కోవిడ్ లక్షణాలు చాలా స్పల్పంగా ఉండడంవల్ల కేవలం వారం రోజుల్లోనే అందరూ కోలుకుంటున్నారు.