బాలీవుడ్: ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి ‘సైనా నెహ్వాల్‘ జీవిత కథ ఆధారంగా ‘సైనా’ అనే బయోపిక్ రూపొందుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో టైటిల్ రోల్ లో బాలీవుడ్ నటి ‘పరిణీతి చోప్రా’ నటిస్తుంది. ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు. ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చి అసాధారణ విజయాలు సాధించిన సైనా జీవిత కథ ఈ సినిమా ద్వారా చెప్పనున్నట్టు ట్రైలర్ ద్వారా తెలిపారు. తన అసాధారణ డ్రీమ్స్ సాధించడానికి సైనా పడిన కష్టం చాలా స్ఫూర్తి నింపేలా చూపించబోతున్నారని అర్ధం అవుతుంది. సైనా చిన్నప్పటి నుండి చేసిన ప్రయాణం, తన తల్లి తండ్రుల సహకారం అన్నీ చూపించారు.
ప్రస్తుతం భారత దేశంలో బాడ్మింటన్ ఆట గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు అన్నా కానీ, పిల్లల్ని స్పోర్ట్స్ కోచింగ్ కి పేరెంట్స్ పంపిస్తున్నారు అన్నా కానీ ఒక రకంగా సైనా నెహ్వాల్ సాధించిన విజయాలు కొంత వరకు కారణం అని చెప్పుకోవచ్చు. తన ప్రయత్నాలే కాకుండా కెరీర్ లో టాప్ పొజిషన్ వెళ్లిన తర్వాత ఇంజ్యూరిస్ బారిన పడి కొద్దిరోజులు బాడ్మింటన్ దూరమైన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనాల్సి వచ్చింది, ఆటని ప్రేమించే ఛాంపియన్స్ ఆటకి దూరమయ్యారు అనే కామెంట్స్ లాంటివి ట్రైలర్ లో చూపించి సైనా లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ చూపించారు. ఓవరాల్ గా ట్రైలర్ చూసిన తర్వాత ఒక ఇన్స్పిరేషనల్ బయోపిక్ చూడబోతున్నాం అని తెలుస్తుంది.
టీ-సిరీస్ , గుల్షన్ కుమార్ సమర్పణలో భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, సుజయ్ జయరాజ్, రషెష్ షా నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. అమోల్ గుప్తే దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చ్ 26 న దేశవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సినిమాని కేవలం హిందీలోనే విడుదల చేస్తున్నారు. పాన్ ఇండియా అప్పీల్ ఉన్న ఈ సినిమాని వివిధ భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తే ఇంకా మంచి రీచ్ ఉండేది. దంగల్, ధోని లాంటి సినిమాలు రీజనల్ భాషల్లో విడుదల చేయడం వలన ఇంకా ఎక్కువ గుర్తింపు లభించింది. ఇంకా సమయం ఉంది కాబట్టి మేకర్స్ ఈ దృష్టిలో ఆలోచించి రీజనల్ భాషల్లో విడుదల చేస్తే బాగుంటుంది.