హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలుకు రంగం దాదాపుగా సిద్ధమైందని సమాచారం. పొరుగు రాష్ట్రం ఏపీ కన్నా మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం లేదని, ఎన్నికల కోడ్ తరువాత అధికార ప్రకటన వెలువడనుందని అధికారవర్గాలు వెల్లడించాయి.
తెలంగానాలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు తమకు సమయం ఇవ్వాలని జనవరి నుంచి టీజీవో, టీఎన్జీవో సంఘాలు సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్‌ను కోరుతున్నాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్ వారికి మంగళవారం సమావేశానికి సమయం ఇచ్చారు. దీంతో టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, టీజీవో అధ్యక్షురాలు మమత, పీఆర్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యద ర్శులు శ్రీపాల్‌రెడ్డి, కమలాకర్‌రావు, మరికొందరు నేతలు సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన పీఆర్సీని మెరుగైన ఫిట్‌మెంట్‌తో అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ పచ్చ జెండా ఊపినట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తున్నందున, తెలంగాణలో ఉద్యోగులకు అంతకంటే 2, 3 శాతం ఎక్కువ ఫిట్‌మెంట్ ఖరారు చేద్దామని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. ఈ లెక్కన 29 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలుకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.