టాలీవుడ్: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో తెలుగు లో హీరోగా పరిచయం అయ్యి సూపర్ హిట్ సాధించిన నవీన్ పోలిశెట్టి హీరోగా, మహానటి సినిమాని డైరెక్ట్ చేసిన నాగ్ అశ్విన్ నిర్మాణంలో రూపొందిన ‘జాతి రత్నాలు’ సినిమా మహా శివరాత్రి సందర్భంగా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా విశేషాలు చూద్దాం.
ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే సినిమా ఎలా ఉండబోతుంది అనే ఒక ఐడియా ని ప్రేక్షకుల మైండ్ లో పెట్టారు మూవీ మేకర్స్. వూర్లో చిల్లరగాళ్లలా ఉండే ముగ్గురు ఫ్రెండ్స్ లైఫ్ స్టైల్ ని మంచి హ్యూమర్ జోడించి ప్రెసెంట్ చేసారు డైరెక్టర్. కథ విషయానికి వస్తే ఈ సినిమాలో పెద్దగా కథ అని అనడం కాకుండా పాత్రలతో జరిగే ప్రయాణం అన్నట్టు ఉంటుంది. వూర్లో ఉండే ముగ్గురు స్నేహితులు ఎదో సాదిద్దాం అని సిటీ కి వచ్చి అనుకోకుండా ఒక హత్యాయత్నం కేసులో ఇరుక్కుని, ఆ తర్వాత ఆ కేసు నుండి ఎలా బయటపడతారు అనేది కథ. సినిమా మొదటి హాఫ్ అంతా హ్యూమర్ తో పూర్తిగా నవ్వుల్లో ముంచెత్తుతారు. సెకండ్ హాఫ్ వచ్చే సరికి కొంచెం చిరాకు తెప్పిస్తాయి కానీ ఓవరాల్ గా ప్రేక్షకులు కథని పక్కన పెడితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు.
సినిమా కథనం, సంభాషణలు రాయడంలో పాత్రల స్వభావాలు నాచురాలిటీ కి చాలా దగ్గరగా చూపించడంలో డైరెక్టర్ అనుదీప్ సక్సెస్ అయ్యాడు. సిల్లీ ఇన్సిడెంట్స్ ని ఒక పూర్తి సినిమాలాగా తెరకెక్కించి థియేటర్లలో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించడం లో సక్సెస్ అయ్యాడు అనుదీప్. ఈ సినిమాలోని ముఖ్య పాత్రల మధ్య జరిగే సంభాషణలు వింటే నిజంగానే ఇలాంటివి మనం రోజూ చూస్తున్నాం కదా అనిపిస్తుంటుంది. అలాంటి ఇన్సిడెంట్స్ ని తీసుకొచ్చి ఆ సిచుయేషన్స్ ని క్రియేట్ చేయడం లో విజయవంతం అవడంలోనే ఈ సినిమా సగం సక్సెస్ అయింది. లేకపోతే సర్కాస్టిక్ కామెడీ ఎలెమెంట్స్ తో వచ్చిన సినిమాలు చాలా వరకు ప్లాప్ లుగా మిగిలాయి. మిగతా టెక్నిషియన్స్ వివరాల్లోకి వెళ్తే మ్యూజిక్ డైరెక్టర్ రాడాన్ ఈ సినిమాకి చిట్టి లాంటి మంచి పాటతో పాటు సింక్ అయ్యే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందించాడు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ఎక్కడ వంక పెట్టడానికి లేవు.
నటీ నటుల పెర్ఫార్మన్స్ లోకి వెళ్తే ఈ సినిమాలోని ముఖ్య పాత్రలు నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లకి వంక పెట్టడానికి లేదు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా ప్రతీ సీన్ లో ఆకట్టుకున్నారు. కొన్ని సన్నివేశాల్లో వీళ్ళు ముగ్గురు చూపించే అమాయకపు హావభావాలు ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తుతాయి. హీరోయిన్ ఫారియా అబ్దుల్లా తన పాత్ర వరకు బాగానే నటించింది. మిగతా పాత్రల్లో తనికెళ్ళ భరణి, మురళి శర్మ, బ్రహ్మాజీ, వెన్నల కిషోర్, బ్రహ్మానందం, జబర్దస్త్ మహేష్, నరేష్ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు.
ఓవరాల్ గా చెప్పాలంటే: ‘నవ్వించే వజ్రాలు ఈ జాతి రత్నాలు’