టాలీవుడ్: ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ లలో తన శైలి ప్రత్యేకం అని తన సినిమాల ద్వారా చాటుకున్నాడు గుణ శేఖర్. ఒక్కడు, చూడాలని ఉంది లాంటి కమర్షియల్ సినిమాలని, సొగసు చూడ తరమ లాంటి క్లాస్ సినిమాలని, మనోహరం లాంటి మెస్సేజ్ ఓరియెంటెడ్ సినిమాలని, బాల రామాయణం, రుద్రమదేవి లాంటి చారిత్రాత్మక సినిమాలు రూపొందించి తన మార్క్ చూపిస్తున్నాడు గుణశేఖర్. రుద్రమదేవి తర్వాత దగ్గుబాటి రానా తో ‘హిరణ్య కశ్యప’ సినిమా పైన చాలా రోజులు పని చేసి ఇపుడు ఉన్న బడ్జెట్ పరిమితులతో ఆ సినిమా వర్క్ అవుట్ అవదు అని ఈ గ్యాప్ లో ‘శాకుంతలం’ అనే మరో చారిత్రాత్మక సినిమాని మొదలు పెట్టాడు గుణశేఖర్.
ఈ రోజు శాకుంతలం సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభం అయింది. ఈ సినిమాలో శకుంతల పాత్రలో సమంత నటిస్తుండగా, దుశ్యంతుని పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. ‘మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శకుంతలం ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా కోసం బాలీవుడ్ లో పేరు పొందిన టెక్నిషియన్స్ ని , డిసైనర్స్ ని రంగంలోకి దించుతున్నాడు గుణశేఖర్. దిల్ రాజు సమర్పణలో గుణ టీం వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం జరుగుతుంది. మణి శర్మ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు.