హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు అసెంబ్లీ సాక్షిగా ఒక గొప్ప శుభవార్త వినిపించారు. రాష్ట్ర ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు సంబందించిన పీఆర్సీ అంశంపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర శాసనసభ సమావేశ వేదికగానే రాబోయే రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవప్రదమైన పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల మీద తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగానే ఉందని, ఇకపై కూడా అలానే ఉంటుందని, వారిపై తమకెంత ప్రేమ ఉందో గత పీఆర్సీతోనే చూపించామని సీఎం కేసీఆర్ అన్నారు.
దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు తామే అత్యధిక జీతాలు పొందుతున్నామని చెప్పుకునే విధంగా వారికి జీతాలు ఇస్తామని ప్రకటించాం, ఇప్పుడు ఆ హామీని అమలు చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాను పీఆర్సీ ప్రకటించిన తర్వాత ఉద్యోగులు తప్పకుండా హర్షం వ్యక్తం చేస్తారనే నమ్మకం తనకుందని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పీఆర్సీ ప్రకటిస్తామన్నారు. కొద్దిరోజుల క్రితం ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కేసీఆర్తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెరుగైన ఫిట్మెంట్ తో పీఆర్సీని ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించినట్లు గతంలో ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు.