టాలీవుడ్: హీరోగా జర్నీ ప్రారంభించి తన దగ్గరికి వచ్చే పాత్రల్లో హీరోయిజమ్ కాకుండా కథకి ప్రాధాన్యం ఇచ్చి చేస్తున్న సినిమాలో చిన్న పాత్ర అయినా అది ప్రత్యేకంగా ఉంటే ఎలాంటి సినిమా అయినా చేయడానికి వెనుకాడడు రానా. రానా , సాయి పల్లవి ముఖ్య పాత్రల్లో విరాట పర్వం అనే కథా ప్రాధాన్యమున్న సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ‘నీది నాది ఒకే కథ‘ లాంటి సినిమాని రూపొందిన వేణు ఊడుగుల రెండవ సినిమాగా విరాట పర్వం ని రూపొందించాడు. ఈ రోజు మెగా స్టార్ చిరంజీవి చేతులమీదుగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేయించింది సినిమా టీం.
‘ఆధిపత్య జాడలనే చేరిపేయగ ఎన్నినాళ్ళు..
తారతమ్య గోడలనే పెకిలించక ఎన్నినాళ్లు..
దున్నేటోడి వెన్ను విరిచి భూస్వాములు ధనికులైరి’ అంటూ రానా చెప్పే డైలాగ్ తో టీజర్ ఆరంభం అయింది. టీజర్ లో మొదటి కొన్ని సెకన్లు విప్లవాత్మకంగా చూపించిన డైరెక్టర్ తరువాత హీరోయిన్ సాయి పల్లవి తో హీరో రాసే కవితలని ఆరాధించి హీరో ప్రేమలో మునిగి పోయే వెన్నెల పాత్రని చూపించాడు. రానా కవితలని ఆరాధించి ప్రేమలో పడి రానా కోసం చావడానికైనా సిద్దపడి అడవిలో ఉండే హీరో కోసం వెళ్లే ప్రయత్నం చూపించాడు. ఈ ప్రయత్నంలో సాయి పల్లవి ఎదుర్కొన్న పరిస్థితులని, సంఘటనలని కళ్ళకి కట్టినట్టు చూపించాడు డైరెక్టర్.
1990 ల్లో జరిగిన నక్సలైట్ కామ్రేడ్ రావన్న జీవిత కథ నేపథ్యం లో ఈ సినిమా రూపొందింది. టీజర్ లో చూపించిన ప్రతీ సీన్ లో 90 ల నాటి లుక్స్ కనపడతాయి. టీజర్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ. మహానటి కి సినిమాటోగ్రఫీ అందించిన డానీ మరియు దివాకర్ ఈ సినిమాకి మంచి కెమెరా పని తనం చూపించారు. సాయి పల్లవి ఉన్న సీన్స్ లో కెమెరా పని తనం ఐఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి కథ మరియు సంభాషణలు అందించిన డైరెక్టర్ వేణు పని తనం టీజర్ లో ఉన్న కొన్ని డైలాగ్స్ లోనే తెలుస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్ మరియు ఎస్.ఎల్.వీ క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30 న ఈ సినిమా థియేటర్లలో విడుదల అవనుంది.