జైపూర్: ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ వల్ల దాదాపుగా అన్ని రంగాలు నష్టాల్లో కూరుకుపోయాయి. దానికి ఇది అది అన్న మినహాయింపసలు లేదు. దీని తారువాత ఆర్థికంగా కోలుకోవడానికి అన్ని రంగాలు వినూత్నంగా ఆలోచిస్తూ కొత్త కొత్త ఆఫర్లను తెరపైకి తెస్తున్నాయి.
ఇలాంటి ఒక ఆలోచనే రాజస్థాన్‌లోని జైపూర్ మెట్రో రైల్ అధికారులు సైతం ఆర్ధికంగా బలోపేతం అయ్యేందుకు తమదైన శైలిలో సరికొత్త ప్రణాళికతో ముందుకు వచ్చారు. తమ మెట్రో స్టేషన్లలో బ్యానర్లు, స్టాండ్లు, పందిళ్లు ఏర్పాటు చేసుకుని ప్రకటనలు వేసుకునేందుకు వారు అవకాశం కల్పించారు.
ఇప్పుడు కొత్తగా బర్త్ డే, ఇతరత్రా వేడుకల కోసం మెట్రో రైల్ కోచ్‌లను అద్దెకు తీసుకోవచ్చని ప్రకటించారు. ఈ కోచ్ లను గంటల ప్రకారం అద్దెకు తీసుకోవచ్చని, అద్దెకు తీసుకొనే వారు గంటకు రూ. 5000 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అనుకున్న సమయానికి మించితే, గంటకు అదనంగా రూ. 1000 ఛార్జీ వసూలు చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థతో కూడా జైపూర్ మెట్రో అధికారులు ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నారని తెలిపింది.