హైదరాబాద్: తెలంగాణ లో ఎంతో సుదీర్ఘ కాలంగా కొనసాగిన మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎట్టకేలకు ముగిసింది. ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుపై తెలంగాణ అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి గెలుపొందారు.
మొదటి నుండి లీడింగ్లో కొనసాగిన ఆమె గెలుపు మొత్తానికి ఖరారైంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. కాగా సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కాగా వాణిదేవి విజయంతో టీఆర్‌ఎస్ శ్రేణులు సంతోషంలో మునిగిపోయారు. ప్రగతి భవన్‌లో కాసేపట్లో విజయోత్సవ సంబరాలకు ఏర్పాట్లు చేస్తుండటంతో, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు.
వాణిదేవికి పోలైన మొత్తం ఓట్ల సంఖ్య 1,49,269 కాగా మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,12,689, రెండో ప్రాధాన్యత ఓట్లు 36,580. కాగా రాంచందర్‌రావుకు వచ్చిన మొత్తం ఓట్లు 1,37,566 మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,04,668, రెండో ప్రాధాన్యత ఓట్లు 32,898 వచ్చాయి. కాగా తెలంగాణలో ఈ నెల 14న రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా ఓట్ల లెక్కింపు జరుగుతుండగా ఈ రోజు మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఫలితం మొత్తానికి వెలువడింది. అయితే ఇంకా నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఫలితం వెలువడాల్సి ఉంది. ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు దిశగా పయనిస్తుండగా, తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో కొనసాగుతున్నారు.