fbpx
Sunday, November 24, 2024
HomeBig Storyసరిగ్గా ఏడాది క్రితం ఇదేరోజు జనతా కర్ఫ్యూ విధింపు

సరిగ్గా ఏడాది క్రితం ఇదేరోజు జనతా కర్ఫ్యూ విధింపు

ONEYEAR-FOR-JANATA-CURFEW-IN-INDIA

న్యూఢిల్లీ: ప్రపంచంపై ఒక్క సారిగా తన పంజా విసిరిన కరోనా వైరస్‌ను ఎదుర్కొనే ఉద్దేశ్యంతో భారతదేశం జనతా కర్ఫ్యూ గత ఏడాది సరిగ్గా ఇదే రోజే పాటించింది. మార్చి 22 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత సంవత్సరం మార్చి 19న దేశ ప్రజలను కోరారు.

ఆ రోజు ఆ నిర్దేశిత సమయంలో ఎవరూ తమ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, ఇది రానున్న రోజులకు సిద్ధమవడం, స్వీయ నియంత్రణ అలవాటు చేసుకోవడం వంటిదని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా తమ ఇంటి ముందుకు లేదా బాల్కనీల్లోకి వచ్చి 5 నిమిషాల పాటు చప్పట్లు కొట్టడం కానీ, పళ్లేలపై శబ్దం చేయడం కానీ చేసి కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితర ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు కృతజ్ఞతలు తెలియజేయాలని దేశ ప్రజలను కోరారు.

కరోనా సోకకుండా ఉండడానికి భౌతిక దూరం పాటించడం అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ప్రధాని పిలుపునకు దేశమంతా సానుకూలంగా స్పందించింది. ఆ రోజు దేశం మొత్తం మీద అత్యవసర సేవలు మినహా సాధారణ జనజీవనం స్తంభించింది. అదే సమయంలో, కరోనా వైరస్‌ వ్యాప్తి చైనాలోని వుహాన్‌ నుంచి ప్రారంభమైందని తేలింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అప్పటికే లాక్‌డౌన్‌ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

కాగా ఆ సమయానికి మన దేశం‌లో కరోనా వైరస్ వ్యాప్తి అంతగా లేదు. చాల వరకు పరిస్థితి అదుపులోనే ఉంది. అయినప్పటికీ, వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించాలని కేంద్రం నిర్ణయించింది. మార్చి 24వ తేదీ రాత్రి ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ ప్రకటన చేశారు. ఈ తొలివిడత లాక్డౌన్ మార్చి 25 నుంచి 21 రోజుల పాటు ఉంటుందని‌ ప్రకటించారు.

ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలని, ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని స్పష్టం చేశారు. నిత్యావసరాలకు మాత్రం మినహాయింపునిచ్చారు. ఈ నిర్ణయం‌తో ఒక్కసారిగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఒకవైపు వైరస్‌ భయం, మరోవైపు, నిలిచిపోయిన జీవనోపాధితో ఆదాయం కోల్పోయి లక్షలాది కుటుంబాలు కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి.

కరోనా వైరస్‌తో వచ్చే వ్యాధి ‘కోవిడ్‌ 19’ బాధితులకు చికిత్స అందించేందుకు దేశవ్యాప్తంగా ఆరోగ్య వసతులను కల్పించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. మరోవైపు, ఉపాధి కోసం ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌ వంటి మహా నగరాలకు వచ్చిన వలస కూలీలు అక్కడి నుంచి తమ స్వస్థలాలకు కాలినడకన వెళ్లడం ప్రారంభించారు.

పిల్లలు, వృద్ధులు, గర్భిణులు కష్టనష్టాలను ఓర్చుకుని వందల కిలోమీటర్ల దూరంలోని సొంతూళ్లకు కాలి నడకన పయనమయ్యారు. ఆ క్రమంలో ఎంతోమంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోయారు. అకస్మాత్తుగా లాక్‌డౌన్‌ విధించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌కు మించిన ప్రత్యామ్నాయం లేదన్న వాదన ప్రారంభమైంది.

ఇదిలా ఉండగా లాక్‌డౌన్‌తో ప్రజల జీవన విధానంలో, వారి ఆలోచన విధానంలో చాలా గణనీయ మార్పులు మొదలయ్యాయి. వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ మరియు ఆర్థిక ప్రణాళికలు బాగా అలవాటయ్యాయి. దీంతోపాటు లాక్‌డౌన్‌తో కుదేలయిన భారత ఆర్థిక రంగం, లాక్‌డౌన్‌ ముగిసిన తరువాత, అదే స్థాయిలో పునరుజ్జీవనం దిశగా వేగంగా పరుగులు తీయడం ప్రారంభించింది. ఇది ఒక పెద్ద సానుకూలాంశం అని చెప్పుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular