న్యూఢిల్లీ : పరిస్థితి చూస్తుంటే మన దేశంలో కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తునట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కేసులే ఇందుకు ఉదాహరణగా అనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్ లో 46,951 కేసులు నమోదయ్యాయి.
ఈ కేసులతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 1,16,46,081కు చేరింది. గత సంవత్సరం నవంబర్ తర్వాత ఇంత పెద్ద మొత్తం కేసులు రావటం ఇదే తొలి సారి. ఇప్పటివరకు కరోనానుంచి కోలుకుని 1.11 కోట్లమంది ప్రజలు బయటపడ్డారు. దేశంలో మృతుల సంఖ్య 1,59,967కు చేరింది. ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడ నిత్యం 20 వేలకు పైగా కేసులు బయటపడుతున్నాయి. నిన్న ఒక్కరోజే 30,535 కేసులు వచ్చాయి.
ఎక్కువ కేసుల్లో మహారాష్ట్ర తర్వాతి స్థానంలో పంజాబ్ (2,644), కేరళ(1,875) కర్ణాటక(1,715) గుజరాత్(1580)లు ఉన్నాయి. కేసుల పెరుగున్న వేగం దృష్ట్యా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కేసులు ఎక్కువున్న పలు ప్రాంతాలో మళ్లీ లాక్‌డౌన్‌ను పాక్షికంగా అమలు చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా మరికొద్దిరోజుల్లో ఉత్తరాఖండ్‌లో జరగనున్న కుంభమేళాను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని సూచనలు చేసింది. పెద్ద మొత్తం భక్తులు ఒక చోట చేరనున్న నేపథ్యంలో కరోనా వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.