అమరావతి: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసింది ఏపీ ప్రభుత్వం. రాబోయే రెండ్రోజుల తరువాత గ్రామ/వార్డు సచివాలయాల్లో కోవిడ్ టీకా వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నాలుగు సచివాలయాల పరిధిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించగా మంచి ఫలితాలొచ్చినట్లు తెలిసింది.
ప్రజలు ఆస్పత్రులకు వెళ్ళి వ్యాక్సినేషన్ వేయించుకోవడం కంటే సమీప సచివాలయాలలో వేయించుకోవడం మంచిదనే అభిప్రాయం ప్రజలలో కలిగింది. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఒకసారి తెలియజేసిన అనంతరం దీనిని అమలు చేయాలని కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు నిర్ణయించారు.
దీనితో ఇక అన్ని వార్డు, గ్రామ సచివాలయాల్లో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రోజుకు కనీసం 3 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సచివాలయాలతో పాటు 1930 ప్రభుత్వాస్పత్రులు, 634 ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లోనూ యథావిధిగా టీకా ప్రక్రియ కొనసాగుతుంది.
రాష్ట్రంలో ఒక్కో ఆరోగ్య కేంద్రం పరిధిలో దాదాపు 10 నుంచి 12 దాకా గ్రామ/వార్డు సచివాలయాలున్నాయి. రోజూ ఓ పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ పరిధిలో ఒక సచివాలయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడతారు. వ్యాక్సిన్ వేసే ముందురోజే దండోరా, లేదా మైక్ అనౌన్స్‌మెంట్లు నిర్వహిస్తారు.
ఏఎన్‌ఎం, ఆశా వర్కర్, వలంటీర్లు, వాక్సిన్ వేయాల్సిన వారి ఇళ్లకు వెళ్లి ఆధార్ కార్డులు సేకరిస్తారు. మరుసటి రోజు ఉదయం 9 గంటలకే ఈ వివరాలన్నీ కోవిన్ సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానించి.. ఆపై టీకాలు వేస్తారు. 45 ఏళ్ల వయసు దాటిన వారికి ఎవరికైనా మెడికల్ సర్టిఫికెట్ లేకుంటే స్థానిక మెడికల్ ఆఫీసరే సర్టిఫై చేస్తారు.