కోలీవుడ్: తమిళ నాడు మాజీ ముఖ్య మంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఇప్పటికే కొన్ని
వెబ్ సిరీస్ లు రూపొందాయి. ఇపుడు కంగనా జయలలిత పాత్రలో ‘తలైవి’ అనే సినిమా రూపొందుతుంది. తమిళ డైరెక్టర్ విజయ్ దర్శకత్వం లో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాని విష్ణు వర్ధన్ మరియు శైలేష్ ఆర్ సింగ్ నిర్మిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ని విడుదల చేసింది సినిమా టీం.
ట్రైలర్ లో జయలలిత ఇండస్ట్రీ కి వచ్చిన పరిస్థితుల నుండి తాను రాజకీయాల్లోకి ఎలా వచ్చింది, వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులని ఎదుర్కొంది, తనకి తగిలిన ఎదురుదెబ్బలు ఏమిటి అనే చాలా అంశాలు దాదాపు మూడు నిముషాలు నిడివి ఉన్న ట్రైలర్ ద్వారా సినిమాలో ఏమి చూపించబోతున్నారు అనేది చూపించారు. సినిమాల్లో వచ్చిన కొత్తల్లో ఎం.జీ.ఆర్ తో ఎలా పరిచయం అయింది, ఎలాంటి పరిస్థితుల్లో తాను రాజకీయాల్లోకి వచ్చింది, ఒక స్త్రీ అవడం వలన రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నది అనేది చూపించారు. తనని ఎప్పటికప్పుడు ఎంత అణచివేయాలనుకున్నా తాను ఒక శక్తి గా ఎలా ఎదిగింది అనేది చూపించారు.
‘ఒక సినిమా నటితో మనకు రాజకీయం నేర్పించడం ఏమిటి, నన్ను అమ్మగా చూస్తే.. నా హృదయంలో మీకు చోటుంటుంది. నన్ను కేవలం ఆడదానిగా చూస్తే..’ అంటూ సాగే డైలాగ్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంది. అంతే కాకుండా అసెంబ్లీ లో మరియు ఎం.జీ.ఆర్ అంత్యక్రియల వద్ద తనకి జరిగిన అవమానాల్ని , చీర లాగడం లాంటివి ఎమోషనల్ గా చూపించి ‘భారతం లో ఒక ఆడదానికి జరిగిన అవమానానికి కౌరవులు మట్టి కొట్టుకుపోయారు.. ప్రస్తుతం మహాభారతానికి ఇంకో పేరుంది .. జయ’ అంటూ సాగే డైలాగ్స్ తో ట్రైలర్ సినీ అభిమానుల్ని ఆకట్టుకుంది.
ట్రైలర్ లో జయలలిత పాత్రలో కంగనా నటన, హావా భావాలు, ఎం.జీ.ఆర్ పాత్రలో అరవిందస్వామి ఆకట్టుకున్నారు. మరిన్ని ముఖ్య పాత్రల్లో సముద్రఖని, మధుబాల మెరిశారు. జి.వీ. ప్రకాష్ ఈ సినిమాకి సంగీతం అందించారు. తెలుగు, తమిళ్ తో పాటు ఈ సినిమాని హిందీ లో కూడా ఏప్రిల్ 23 న విడుదల చేస్తున్నారు.