హైదరాబాద్: తెలంగాణలో కొత్త కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రం మొత్తం విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా విస్తృతి తిరిగి పెరుగుతున్న సందర్భంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని నాలుగు రోజుల కిందట సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మంగళవారం శాసనసభలో దీనికి సంబంధించిన ప్రకటన చేశారు. రాష్ట్ర పద్దులపై చర్చ సందర్భంగా మంత్రులు సమాధానం చెప్తున్న సమయంలో అత్యవసర ప్రకటన ఉందంటూ స్పీకర్ పోచారం వెల్లడించారు. తరువాత సబితారెడ్డి స్కూళ్లు, కాలేజీల మూసివేతకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశంలో మరియు రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్ అత్యంత తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. పొరుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇక రాష్ట్రంలోని విద్యాసంస్థల్లోనూ చెదురుమదురుగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కరోనా విజృంభించే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు విద్యాసంస్థలను మూసివేశాయి.
అయితే వైద్య కళాశాలలు మినహా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలకు మాత్రమే వర్తిస్తాయి. విద్యార్థులకు గతంలో నిర్వహించినట్టుగా ఆన్‌లైన్ శిక్షణ తరగతులు ఇప్పుడు తిరిగి కొనసాగుతాయి, అని సబితారెడ్డి ప్రకటించారు.