హైదరాబాద్ : సెకండ్ వేవ్ దేశ వ్యాప్తంగా విస్తృతి చెందుతూ దేశాన్ని మళ్ళీ భయాందోళనలకు గురి చేస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు అంతకంతకూ రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నివారణ చర్యలను ముమ్మరం చేసింది. ఇక రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పని సరిగా వాడాలని దీన్ని ఖచ్చితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక రాష్ట్రంలో బహిరంగ సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు ఇలా జనం గుమిగూడే కార్యక్రమాలన్నీ నిషేధిస్తున్నట్లు శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. హోలీ, శ్రీరామ నవమి వేడుకల్లో కూడా గుమిగూడవద్దని ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ రెండు జీవోలు జారీ చేశారు. నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు.
తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 495 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,05,804కి చేరింది. కరోనాతో గడిచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా ఇప్పటి వరకు మొత్తం 1,685 మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,241 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 2,99,878 మంది డిశ్చార్జ్ అయ్యారు.