డెహ్రాడూన్: దేశంలో రోజు ఎక్కడో ఒకచోట కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తూనే ఉంది. గత ఏడాది మాదిరి మళ్ళీ తీవ్ర రూపం దాల్చి విజృంభిస్తోంది. తాజాగా ఉత్తరాఖండ్‌లో కూడా కరోనా కలకలం రేపుతోంది. ఒకేసారి 76 మందికి పాజిటివ్ సోకడంతో ప్రముఖ హోటల్ ‘తాజ్’ మూతపడింది.
స్థానిక జిల్లా అధికారుల ఆదేశాల మేరకు నిర్వాహకులు తాజ్ హోటల్‌ను మూడు రోజుల పాటు మూసి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. పర్యాటక ప్రాంతాలుగా ఉన్న రిషికేశ్, డెహ్రాడూన్లలో భారీగా కేసులు నమోదవుతుండడంతో కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు ప్రకటించారు.
హోటల్‌ను పూర్తిగా శానిటైజ్ చేశామని, ఇక ముందు జాగ్రత్తలో భాగంగా హోటల్ మూసివేసినట్లు ఎస్పీ తృప్తి భట్ మీడియాకు తెలిపారు. రిషికేశ్‌లోని తాజ్ రిసార్ట్ అండ్ స్పాలో గత మంగళవారం 16 మంది ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో అప్రమత్తమైన నిర్వాహకులు పరీక్షలు భారీగా చేయించారు.
ఈ నేపథ్యంలో ఇంకా మరికొందరికి పరీక్షలు నిర్వహించడంతో మొత్తం కేసులు 76 కి చేరుకున్నాయి. దీంతో మరో మూడు రోజుల పాటు హోటల్‌ను మూసివేశారు. అయితే కొన్ని రోజుల్లో ఉత్తరాఖండ్‌లో జరగాల్సిన మహాకుంభమేళాకు ప్రభుత్వం సర్వ సిద్ధమైంది. ఈ సమయంలో కేసులు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ సందర్భంగా మేళాకు వచ్చేవారు కచ్చితంగా పరీక్షలు చేసుకోవాలని నెగటివ్ వస్తేనే అనుమతి ఇవ్వనున్నారు.