న్యూఢిల్లీ: కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. నేటి నుంచి ఆర్థిక విషయాల్లో పలు కీలక మార్పులు జరగనున్నాయి. పలు వస్తువుల ధరలు చాలా వరకు పెరగనున్నాయి. వాటి వల్ల చాలా మందిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి ధరలు పెరిగేవాటిలో టెలివిజన్, ఎయిర్ కండీషనర్స్, రెఫ్రిజరేటర్లు, కార్లు, బైక్ లు వంటివి ఉండనున్నాయి.
దీనితో పాటు విమాన ప్రయాణాల ఖర్చులు కూడా పెరగనున్నాయి. ఎలక్ట్రానిక్ ప్రొడక్టులు తయారు చేసే కంపెనీలు, వాహన కంపెనీలు ముడి పదార్థాల ధరల పెరగడం వల్ల తమ వస్తువుల ధరలను పెంచుతున్నట్లు పేర్కొన్నాయి.
వ్యాపారులు వాహన ధరలను పెంచడంతో కార్లు, బైక్లు 2021 ఏప్రిల్ 1 నుంచి ఖరీదైనవిగా మారనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి రేట్లను పెంచుతున్నట్లు ఇప్పటికే మారుతి, నిస్సాన్ సంస్థలు వెల్లడించాయి. మొదటి సారిగా దేశంలో తన కార్లన్నింటినీ ధరలు పెంచుతున్నట్లు మారుతి సుజుకి ప్రకటించింది. అలాగే, ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు కూడా తమ ద్విచక్ర వాహనాల ధరలను పెంచుతున్నట్లు పేర్కొన్నారు.
2021 ఏప్రిల్ 1 నుంచి టెలివిజన్ ధరలు పెరగనున్నాయి. వీటితో పాటు ఎయిర్ కండీషనర్, రిఫ్రిజిరేటర్ కూడా ధర పెరిగే జాబితాలో ఉన్నాయి. తయారీ ఖర్చుల వల్ల ఎయిర్ కండీషనర్, రిఫ్రిజిరేటర్ ధర కూడా పెరుగనున్నాయి. దేశీయ విమానాల కనీస ఛార్జీలు 5 శాతం పెరుగుతాయి కాబట్టి విమానంలో ఇక ప్రయాణించడం కూడా ఖరీదైనదిగా మారనుంది.