కోలీవుడ్: తమిళ హీరో మాధవన్ మణి రత్నం రూపొందించిన ‘సఖి’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. లవర్ బాయ్ ఇమేజ్ నుండి తన దగ్గరికి వచ్చిన అన్ని పాత్రలు చేసుకుంటూ హీరోగా, విలన్ గా, ఫ్రెండ్ గా కేవలం తమిళ్ మాత్రమే కాకుండా తమిళ్, తెలుగు మరియు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసి ఆకట్టుకున్నాడు. ప్రసుతం మాధవన్ హీరోగా మాత్రమే కాకుండా సొంత దర్శకత్వంలో ‘రాకెట్రీ’ అనే సినిమాని రూపొందించాడు. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది.
మాజీ ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నాడు మాధవన్. అందుకే ఈ సినిమాకి టాగ్ లైన్ గా ‘నంబి ఎఫెక్ట్’ అని పెట్టాడు. ఈ సినిమాకి హీరో, రచయిత, నిర్మాత , దర్శకుడు ఇలా అన్నీ తానై చూసుకుని ఈ సినిమాని రూపొందించాడు. ఈ సినిమాలో తమిళ హీరో సూర్య, బాలీవుడ్ హీరో షారూక్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ని ఈ రోజు అమితాబ్ బచ్చన్ విడుదల చేసారు.
ఇస్రోలో స్పేస్ సైంటిస్ట్ గా పనిచేసే నంబి నారాయణన్ కొందరి కుట్రలవల్ల ఒక కుంభకోణం లో ఇరుక్కుంటాడు. అలాంటి పాత్రలో మాధవన్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో నంబి నారాయణన్ యంగ్ ఏజ్ నుండి ముసలి తనం చేరే వరకు మాధవన్ రకరకాల గెట్ అప్ లలో కనిపించబోతున్నాడు. ట్రైలర్ లో చాలా సీన్స్ లలో మాధవన్ ఎక్స్ప్రెషన్స్ మరియు నటన ఆకట్టుకుంది. ఈ సినిమాని ఒక పేట్రియాటిక్ గా మాత్రమే కాకుండా ఎమోషనల్ గా కూడా తీర్చిదిద్దాడు మాధవన్.
ఈ సినిమాకి సామ్.సి.ఎస్ అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. ట్రై కలర్ ఫిలిమ్స్ , వర్గీస్ మూలాన్ పిక్చర్స్ సమర్పణలో సరితా మాధవన్, మాధవన్, వర్గీస్ మూలాన్ మరియు విజయ్ మూలాన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ రోజు విడుదలైన ఈ ట్రైలర్ కి సామాన్య ప్రజల నుండే కాకుండా వివిధ సినిమా ఇండస్ట్రీల టాప్ హీరోస్ నుండి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మలయాళం లో ఇలా ఆరు భాషల్లో ఈ వేసవి లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.