న్యూఢిల్లీ: నేషనల్ కాంగ్రెస్ నాయకురాలు, సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కరోనా బారిన పడ్డారు. దినివల్ల ప్రస్తుతం తామిద్దరు ఢిల్లీలోని వారి నివాసంలో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నామని ప్రియాంక గాంధీ స్వయంగా ట్వీట్ చేశారు. దానికి ముందు కోవిడ్ పాజిటివ్‌గా తనకు నిర్ధారణ అయినట్లు వాద్రా ఫేస్బుక్ వేదికగా ప్రకటించారు. అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేనప్పటికి పాజిటివ్ వచ్చిందని తెలిపాడు వాద్రా. ప్రియాంక ఆ తర్వాత తన ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు.
‘‘నా భర్త వాద్రాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. నేను కూడా టెస్ట్‌లు చేయించుకున్నాను, అయితే నాకు నెగిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం మేం హోం క్వారంటైన్లో ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికల దృష్టా నేను అస్సాం, తమిళనాడులో పర్యటించి అక్కడ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళలేను. ఇందుకు నేను చాలా చింతిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నాను’’ అని ప్రియాంక తన వీడియోలో తెలిపారు.
మా పిల్లలు కూడా గత కొద్ది కాలంగా మాతోనే ఉన్నారు, అదృష్టం కొద్ది ప్రియాంకకు, పిల్లలకు నెగిటివ్‌గా తేలింది, అని రాబర్ట్ వాద్రా ఫేస్ బుక్ లో ప్రకటించారు. ఇక ప్రియాంక గాంధీ మంగళవారం కేరళలో ఒక రోడ్ షోలో పాల్గొన్నారు. అంతకు ముందు అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అక్కడ ప్రచారం కూడా చేశారు.