హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఆసుపత్రి ఐసీయూలో ప్రస్తుతం 136 మంది కరోనా రోగులకు వైద్యసేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గ అధికారులు తెలిపారు. ప్రధాన భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ట్రైయాజ్ ఏరియా, రెండు, మూడు అంతస్తుల్లో 300 పడకలతో కోవిడ్ ఐసీయూను అందుబాటులోకి తెచ్చారు.
అత్యవసరస్థితిలో ఉన్న కరోనా పేషెంట్స్ కు మాత్రమే ఐసీయూలో వైద్యసేవలు అందిస్తున్నామని, కరోనా పాజిటివ్ గా ఉండి ఎటువంటి లక్షణాలు లేనివారిని కింగ్‌కోఠి, టిమ్స్ ఆస్పత్రులకు రిఫర్ చేసి పంపుతున్నామని అధికారులు వివరించారు. కాగా మొదటి వేవ్ తో పోలిస్తే సెకండ్‌వేవ్‌లో కోవిడ్ రోగులతోపాటు మృతుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నట్లు ఆస్పత్రికి చెందిన ఓ అధికారి వాఖ్యానించడం గమనార్హం.
కాగా ఈ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రత్యేక కరోనా మార్చురీని కూడా గురువారం అందుబాటులోకి తెచ్చారు. అక్కడ కోవిడ్, నాన్‌కోవిడ్ రెండు రకాల వైద్యసేవలు అందిస్తున్న నేపథ్యంలో వారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత మార్చురీ పక్కన గల బయోమెడికల్ వేస్టేజీ పాంట్ల్‌ను కరోనా మార్చురీగా ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు.