విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఐటీ పరిశ్రమ విస్తరణ కోసం సీఎక్స్‌ఓ సదస్సు నిర్వహించబోతున్నట్లు ఏపీ ఐటీ శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలతో ఐటీ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళనున్నట్లు తెలిపారు.
ఏపీలో విద్యారంగంలో విద్యాకానుక పథకం సహా అనేక పథకాలు అమలు చేస్తున్నామని, ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య,వైద్యం కోసం ఇలాంటి పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ అభివృద్ధి, నాణ్యమైన మానవ వనరుల తయారీకి కూడా ఎంతో కృషి చేస్తున్నట్లు అన్నారు.
దేశంలో మరియు రాష్ట్రంలొ కోవిడ్ వల్ల తీవ్ర ఇబ్బందులు వచ్చాయని, అలాంటి విపత్కర సమయంలో ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలను ఏపీ ప్రభుత్వం ఆదుకుందన్నారు. జగనన్న తోడుతో చిన్న వ్యాపారులకు ఉపాధి అవకాశాల కల్పనకు సహకరించామని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో అన్ని పథకాల్ని ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు అందిస్తోందన్నారు. ప్రభుత్వ నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, రాష్ట్రంలో ఐటీ మౌలిక వసతులు కల్పించడంపై కూడా పూర్తి దృష్టి పెట్టామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 3 కాన్సెప్ట్ సిటీలను రెండు వేల ఎకరాలలో నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఫైబర్ నెట్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి మారుమూల గ్రామానికి 2024 నాటికి ఇంటర్నెట్ అందిస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలో డిజిటల్ లైబ్రరీ, డిజిటల్ బ్రాడ్ బ్యాండ్ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు.