న్యూఢిల్లీ: చమురు ఎగుమతి దేశాల (ఒపెక్) సంఘం అంచనా ప్రకారం ప్రపంచ ఎకానమీ రాబోయే రోజుల్లో రికవరీ బాటలో పయనిస్తుందని చెబుతోంది. ఈ ఆశావాద ధృక్పథంతో రానున్న నెలల్లో క్రమంగా చమురు ఉత్పత్తిని పెంచడానికి తన మిత్రదేశాలతో కలిసి నిర్ణయం తీసుకుంది. తాజా గా తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం మే నుంచి జూలై వరకూ మొత్తంగా రోజుకు 2 మిలియన్ బ్యారళ్లకుపైగా అదనపు ఉత్పత్తి జరగనుంది.
ఈ లెక్క ప్రకారం మే నెలలో ప్రతిరోజు దాదాపు 3,50,000 బ్యారళ్ల అదనపు ఉత్పత్తి జరుగుతుంది. జూన్ నెల్లో కూడా అదనపు ఉత్పత్తి ఇదే స్థాయిలో రోజుకు 3,50,000 బ్యారళ్లు జరుగుతుంది. జూలైలో మాత్రం ప్రతిరోజు 4,00,000 బ్యారళ్ల వరకు అదనపు ఉత్పత్తి చేయడం జరుగుతుంది.
అలాగే సౌదీ అరేబియా కూడా రోజుకు అదనంగా ఒక మిలియన్ బ్యారళ్ల చమురు ఉత్పత్తిని చేయనుంది. మార్చిలో ఒపెక్ తన ఉత్పత్తిని రోజుకు 3,00,000 బ్యారళ్ల మేర అదనంగా పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో రోజుకు సగటు ఉత్పత్తి 25.33 మిలియన్ బ్యారళ్లకు చేరింది.
గత ఏడాది మార్చి నెల జరిగిన సమా వేశం తరహాలోనే సరఫరాల విషయంలో ఒపెక్ జాగరూకతతో వ్యవహరించింది. ఉత్పత్తి లక్ష్యాలను భారీగా పెంచకపోవడం వల్ల స్వల్ప కాల వ్యవధిలో ధరల స్థిరీకరణ జరగవచ్చని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థల రికవరీ బాగుంటుందని, ఈ నేపథ్యంలో క్రూడ్ డిమాండ్ భారీగా పెరుగుతుందని ఒపెక్ దేశాలు భావిస్తున్నాయి.
ప్రపంచం మొత్తం మీద జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం, ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకుల ఉద్దీపన చర్యలు గ్లోబల్ ఎకానమీ వృద్ధికి బాటలువేస్తాయని ఒపెక్ దేశాలు అంచనా వేస్తున్నాయి. కరోనా మహమ్మారి ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిసారి అమెరికా రిఫైనరీలు భారీగా క్రూడ్ ప్రాసెసింగ్ చేసిన విషయాన్ని సంబంధిత వర్గాలు ప్రస్తావించాయి.