హైదరాబాద్: కరోనా వైరస్ సెకండ్ వేవ్‌లో దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద రోజువారీ కేసుల సంఖ్య లక్ష మార్క్‌ను దాటీన మొదటి దేశం గా భారత్ ఉండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అప్రమత్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణా జంట నగరాల పరిధిలోని నాంపల్లి క్రిమినల్ కోర్టులు, సిటీ సివిల్ కోర్టు, సిటీ స్మాల్‌కాజెస్ కోర్టులతోపాటు రంగారెడ్డి జిల్లా కోర్టుల పరిధిలో ఉన్న పలువురు న్యాయమూర్తులు కరోనా వైరస్ బారిన పడ్డారు. అలానే సంఖ్యలో కోర్టు సిబ్బంది, న్యాయవాదులకు కూడా ఈ కరోనా సోకింది.
అందు వల్ల రోజువారి విచారణలకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి తుకారాంజీ రాసిన లేఖపై హైకోర్టు స్పందించింది. భౌతిక విచారణ నిలిపివేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీచేశారు.
క్రితం ఏడాది జూన్‌లో కరోనా కేసులు తీవ్రంగా ఉన్నప్పటి ఆదేశాలను ఇప్పుడు మళ్ళీ వాటినే అమలు చేయాలన్నారు. దీంతో జంట నగరాలు, రంగారెడ్డి జిల్లా పరిధిలోని కోర్టుల్లో కేసులను ఇక పై భౌతికంగా విచారించడం జరగదు. అతి ముఖ్యమైన మరియు తుది వాదనల సమయంలో ఉన్న 20 కేసులను మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశముంది.
ఆయా కేసుల్లో కక్షిదారులు హాజరుకాకపోయినా ప్రతికూలమైన ఆదేశాలు జారీచేయరాదంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేస్తారు. అయితే ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ ప్రత్యేక కోర్టులో రోజూవారీగా విచారణ చేయాల్సిన అవసరం లేదని, కోర్టు వీలును బట్టి కేసులను పరిష్కరించాలని స్పష్టంచేశారు.